: కాల్పులతో దద్దరిల్లిన యూఎస్ నైట్ క్లబ్.. పలువురికి గాయాలు!
అమెరికా మరోమారు కాల్పులతో దద్దరిల్లింది. న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రిలో కాల్పులతో విరుచుకుపడిన ఘటనను మరువకుండానే, ఓ నైట్ క్లబ్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. లిటిల్ రాక్ లోని ఓ నైట్ క్లబ్ లో వ్యక్తి తుపాకితో విచక్షణా రహితంగా కాల్పులు జరుపగా 17 మందికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరుగుతున్న వేళ, బయటకు వెళ్లేందుకు ప్రజలు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగిందని, ఆ ఘటనలోనే అత్యధికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. నిందితుడు పారిపోయాడా? అన్న విషయమై స్పష్టత లేదు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.