: ఒక్క 'పెన్ను'పోటుతో లక్ష కంపెనీలు గంగలో కలిసిపోయాయి.. నల్లధనంపై ఇది మా రెండో దాడి: ప్రధాని


నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు అనుమానిస్తున్న లక్షకు పైగా కంపెనీలు జీఎస్టీ ప్రభావంతో రిజిస్ట్రేషన్‌ కోల్పోయినట్టు ప్రధాని మోదీ తెలిపారు. నల్లధనంపై ఇది తమ రెండో దాడి అని ఆయన అభివర్ణించారు. ‘‘జీఎస్టీకి సరిగ్గా 48 గంటల ముందు ఒక్క పెన్ను పోటుతో లక్షకుపైగా కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు అయింది’’ అని మోదీ పేర్కొన్నారు. మరో రెండు లక్షల కంపెనీలపై నిఘా పెట్టినట్టు తెలిపారు. ఈ కంపెనీలన్నీ అవాస్తవ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు తేలిందన్నారు. మనీ లాండరింగ్‌కు పాల్పడుతూ  నల్ల ధనానికి ఊతమిస్తున్న 37 వేల షెల్ కంపెనీలను గుర్తించినట్టు వివరించారు.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. నల్లధనం, అవినీతిపై తమ యుద్ధం కొనసాగుతుందన్నారు. అందులో భాగంగా తీసుకుంటున్న చర్యల్లో జీఎస్టీ కూడా ఓ భాగమన్నారు. ఒకే ఒక్క నిర్ణయంతో లక్ష కంపెనీలు రిజిస్ట్రేషన్‌కు నోచుకోకుండా పోయాయన్నారు. రాజకీయ ప్రయోజనాలతో గత ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయిందని విమర్శించిన మోదీ, దేశాన్ని ప్రేమించే వారు మాత్రమే ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు.

  • Loading...

More Telugu News