: విద్యార్థులకు కటింగ్ చేసి.. అమానవీయంగా ప్రవర్తించిన స్కూల్ యాజమాన్యం!
విద్యార్థులకు జుట్టు కటింగ్ చేసి, స్కూల్ యాజమాన్యం అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ముంబయి, విక్రోలీ ప్రాంతంలోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. ఇటీవల ఆ స్కూల్ డైరెక్టర్ అన్ని తరగతుల గదులను తనిఖీ చేసి, విద్యార్థులు సరిగా కటింగ్ చేయించుకోకుండానే వస్తున్నారని తెలుసుకున్నారు. తాను మరోసారి ఇన్‌స్పెక్షన్‌కు వస్తానని, బాలురందరూ తమ జుట్టును చిన్నగా కటింగ్ చేసుకోవాలని చెప్పారు. అనంతరం డైరెక్టర్ కుమారుడు, పీఈటీ టీచర్, సహాయక సిబ్బంది జుట్టు అధికంగా పెంచుకుని వస్తున్న పిల్లలని స్కూల్ బయట నిలబెట్టారు.
మొత్తం 25 మంది పిల్లలకు కటింగ్ చేశారు. అయితే, అది కూడా ఓ క్రమ పద్ధతిలో చేయలేదు. తమకు ఇష్టం వచ్చినట్లు తలపై అక్కడక్కడా జుట్టు తీసేశారు. దీంతో పిల్లలంతా ఏడుపులంకించుకున్నారు. పాఠశాల అయిపోగానే ఇంటికి వచ్చిన తమ పిల్లల జుట్టుని చూసి ఆగ్రహం తెచ్చుకున్న వారి తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీసినా పట్టించుకోలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీఈటీ టీచర్, సహాయకసిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న డైరెక్టర్ కుమారుడి కోసం గాలిస్తున్నారు.