: ఫేస్ బుక్ లో పరిచయం చేసుకుని.. హత్యచేసి డబ్బులు, నగలు దోచుకుంటున్న యువతి
ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు చేసుకోవడం అమ్మాయిలకే కాదు యువకులకు కూడా శాపంగా మారుతోంది. ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో పరిచయం చేసుకున్న ఓ యువతి మాయమాటలు చెప్పి అతడిని కలుసుకొని హత్య చేసి డబ్బు, బంగారం దోచుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, బీహార్‌లోని ఫుల్వారిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడని సమాచారం అందుకున్న పోలీసులు ఎట్టకేలకు కేసును ఛేదించి ఆ యువతిని అరెస్టు చేసి వివరాలు తెలిపారు.
జార్ఖండ్‌కు చెందిన అంజన కుమారి (24) అలియాస్ అంజన మండల్‌కు ఫేస్‌బుక్ ద్వారా బీహార్‌లోని పాట్నాకు చెందిన మహ్మద్ షాహీమ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. చిన్న దుకాణాన్ని నిర్వహించుకునే ఆ యువకుడితో ప్రతిరోజు ఛాటింగ్ చేసేది. తీయని మాటలు చెబుతూ ఆకర్షించేది. ఇటీవల వీరిరువురూ ఓ చోట కలవాలని అనుకున్నారు. ఫుల్వారిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కోజా ఇమ్లీ ప్రాంతంలో వీరిరువురూ కలుసుకున్నారు. ఆ యువకుడు ఆమెను తన దుకాణం వద్దకు తీసుకెళ్లగా, అదే రోజు రాత్రి షాహిమ్‌ను అంజన చంపేసి, దుకాణంలో ఉన్న నగదు, బైక్ తీసుకుని పరారయింది. అంజన ఆ ఒక్క యువకుడినే మోసం చేయలేదని, సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది యువకులను పరిచయం చేసుకుని ఇలాగే మోసం చేసిందని పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయి చేతితో ఎంతమంది యువకులు మోసపోయారనే విషయాన్ని ప్రస్తుతం రాబడుతున్నామని చెప్పారు.