: అయ్యా! అసలు ఈ జీఎస్టీ ఏంటి? కాస్త చెప్పరూ..!: వారణాసి వ్యాపారులు
అసలు ఈ జీఎస్టీ అంటే ఏంటో.. దాని గొడవేంటో.. తమకు వివరించాలని ప్రధాని నరేంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసి వ్యాపారులు కోరుతున్నారు. తమకు అంతా గందరగోళంగా ఉందని, జీఎస్టీ వార్తలతో తమకు నిద్ర పట్టడం లేదని పేర్కొంటున్నారు. జీఎస్టీపై స్పష్టత వచ్చే వరకు దానిని అమలు చేయడం తమకు ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. అందులో భాగంగా 24 గంటలపాటు దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చారు.
జీఎస్టీని సులభం తరం చేయాలని, దాని గురించి తమకు పూర్తిగా వివరించాలని వ్యాపారులు కోరుతున్నారు. జీఎస్టీ విషయంలో తమకు సరైన అవగాహన వస్తే అధికారులు తమను మోసం చేసే వీలుండదని చెబుతున్నారు. దుకాణాలు బంద్ చేయాలన్న నిర్ణయానికి వ్యాపారులందరూ మద్దతు పలికారని స్థానిక వ్యాపారి ఒకరు పేర్కొన్నారు. జీఎస్టీలోని సంక్లిష్టతలను ప్రభుత్వం తొలగించకుంటే తమ నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఇందులో ఆరు శ్లాబులు ఉన్నాయి. సున్న నుంచి 43 శాతం వరకు పన్నులు ఉన్నాయి.