: జెట్ ఎయిర్‌వేస్ విమానంలో బాలుడి జననం.. 'జెట్‌సన్'గా నామకరణం!
జెట్ ఎయిర్‌వేస్ విమానం గాల్లో ఉండగా జన్మించిన బాలుడికి ఆ పిల్లాడి తల్లి జెట్‌సన్‌గా నామకరణం చేసింది. జూన్ 18న దమ్మాం-కొచ్చి విమానంలో ప్రయాణిస్తున్న కేరళలోని కొచ్చికి చెందిన గర్భిణి సి.జోస్(29) విమానంలో పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ఆ వెంటనే విమానాన్ని ముంబైకి మళ్లించి మహిళ, శిశువును హోలీ స్పిరిట్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మహిళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. అనంతరం ఆమె కొచ్చికి బయలుదేరింది.
విమానంలో నొప్పులు ప్రారంభమైన సమయంలో విమాన సిబ్బంది సహకరించి సుఖ ప్రసవానికి సాయం చేశారని జోస్ పేర్కొన్నారు. విమానం గాల్లో ఉండగానే బాబు జన్మించాడని, అది జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం కావడంతో బాబుకు జెట్‌సన్‌గా నామకరణం చేసినట్టు తెలిపారు. నిజానికి 30 వారాల గర్భిణి అయిన మహిళలు విమానంలో ప్రయాణించాలంటే వైద్యుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 35 వారాలు దాటితే అంతర్జాతీయ విమానాల్లో గర్భిణుల ప్రయాణానికి అనుమతి లేదు.