: నేను దేవుడిని.. నన్ను రాష్ట్రపతిని చేయకపోతే ఢిల్లీలో భయంకరమైన భూకంపం వస్తుంది!: తిరస్కరణకు గురైన నామినేషన్లో ఓ అభ్యర్థి
జులై 17న రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 95 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. రిటర్నింగ్ అధికారులు వాటిని పరిశీలించిన అనంతరం 93 నామినేషన్లను తిరస్కరించడం జరిగింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరపున రామ్‌నాథ్ కోవింద్, విపక్షాల నుంచి మీరా కుమార్ మాత్రమే బరిలో నిలిచారు. అయితే, తిరస్కరించిన నామినేషన్లలో కొన్ని నామినేషన్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిందే. ఎందుకంటే, ఆ నామినేషన్ పత్రాల తీరే సెపరేటుగా వుంది.
అలా తిరస్కరించిన నామినేషన్లలో హరియాణాలోని పానిపట్‌కు చెందిన దేవి దయాళ్ అగర్వాల్ నామినేషన్ కూడా ఉంది. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న ఆయన తన నామినేషన్ లో ఏం రాశారంటే.. ‘నేను దేవుడిని, నన్ను రాష్ట్రపతిని చేయండి. సర్వశక్తిమంతుడిని అయిన నాకు ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కూడా అవసరం లేదు. మీరాకుమార్, రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నిక కాలేరు. వాళ్లవద్ద ఏమైనా మంత్రదండం ఉందా? నా అభ్యర్థనను విని నన్ను రాష్ట్రపతిని చేయకపోతే ఢిల్లీలో భయంకరమైన భూకంపం వస్తుంది’ అని రాసుకున్న అగర్వాల్, తనను తాను 24 సార్లు దేవుడిగా సంబోధించుకున్నారు.
అదే రాష్ట్రంలోని జింద్ ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్ కూడా రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతు ఇస్తున్నట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న పేర్లను పరిశీలిస్తే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. ఎందుకంటే ఆయనకు మద్దతు ఇచ్చిన వారి పేర్లలో ఎప్పుడో దివంగతులైన భారత స్వాతంత్ర్య సమరయోథులు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద, భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దక్షిణాఫ్రికా పోరాట యోధుడు, మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జెఎఫ్.కెన్నడీ, రొనాల్డ్ రేగన్, ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు లెనిన్, మార్టిన్ లూథర్‌కింగ్, భౌతికశాస్త్రవేత్త ఐన్‌స్టీన్ తదితరుల పేర్లు ఉన్నాయి. మరొకరయితే ఏకంగా ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, బిర్లా, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తదితరులు తనకు మద్దతిస్తున్నట్లు తన నామినేషన్ పత్రాల్లో రాసుకోవడం నవ్వు తెప్పించకమానదు.