: అక్కడ నటించాల్సిన అవసరం లేదు!: ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా... ఈ పేరు మనకు ఎంత పరిచయమో, ఇంగ్లిషు ప్రేక్షకులకు కూడా అంతే పరిచయం. ఇంగ్లిషులో టీవీ సిరీస్లు, సినిమాలతో దూసుకెళ్తున్న ప్రియాంక ఇప్పటికే అక్కడ ప్రసారమయ్యే అన్ని చాట్ షోలకు వెళ్లింది. ఎలెన్ డీజేనరీస్, జిమ్మీ కెమ్మెల్ వంటి ఫేమస్ చాట్ షోలకు రెండు మూడు సార్లు వెళ్లింది. ఏ షోకి వెళ్లినా తనదైనా చలాకీతనంతో, ఆకట్టుకునే మాటలతో అందరి మనసుల్ని దోచేస్తుంది. ఇదెలా సాధ్యం? షోకి వెళ్లే ముందు ఏమైనా ప్లాన్ చేసుకుంటారా? అనే ప్రశ్నలకు కూడా ఆమె ఆకట్టుకునే సమాధానం చెప్పింది.
"చాట్ షోల్లో నేను నేనుగా ఉండే అవకాశం దొరుకుతుంది. అది నాకు చాలా ఇష్టం. అలాంటి షోలకు ముందే సన్నద్ధమవడాలు ఉండవు. అలా ఉంటే అది సహజంగా ఉండదు. వ్యాఖ్యాతలు అడిగే ప్రశ్నల గురించి నాకు భయం లేదు. నా జీవితం కెమెరాల చుట్టే తిరుగుతోంది. నా గురించి దాచిపెట్టాల్సిన విషయాలేమీ లేవు. అన్ని కెమెరాల ముందు నటించాలి. చాట్ షో కెమెరా ముందు మాత్రం నేను నటించనక్కరలేదు" అంటూ నవ్వేసింది ప్రియాంక చోప్రా.