: రజనీ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న కుటుంబీకులు!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఓ వైపు రజకీ కొత్త పార్టీ పెడతారని ఆయన సోదరుడు ఇప్పటికే ప్రకటించినప్పటికీ... రజనీ నుంచి మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో, ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
మరోవైపు, రజనీ రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికర కథనం వినిపిస్తోంది. రజనీ రాజకీయాల్లోకి రావడం ఆయన కుటుంబీకులకు ఏ మాత్రం ఇష్టం లేదట. ఇప్పటికే ఆయన సింగపూర్ లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పుడు కూడా వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, రాజకీయాల్లోకి వస్తే ఆయన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారట. రాజకీయాలు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మధనపడుతున్నారట. అందుకే, రాజకీయాల్లోకి వెళ్లవద్దని వారు రజనీని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. అయితే, రజనీ చిన్న కుమార్తె సౌందర్య మాత్రం నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా తాను పూర్తిగా మద్దతు పలుకుతానని చెప్పడం విశేషం.