: బీసీసీఐ అడిగితేనే చెబుతా.. కొత్త కోచ్‌పై విరాట్ కోహ్లీ విస్పష్ట సమాధానం!
టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు పెదవి విప్పాడు. కోచ్ విషయంలో బీసీసీఐ తన అభిప్రాయం అడిగితేనే చెబుతానని స్పష్టం చేశాడు. కోచ్ విషయంలో అభిప్రాయం చెప్పాల్సిందిగా కోహ్లీని ప్రశ్నించగా పై విధంగా పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానేమీ చెప్పదలుచుకోలేదని పేర్కొన్నాడు. బీసీసీఐ కనుక తనను సంప్రదిస్తే జట్టుగా తన అభిప్రాయం చెబుతానన్నాడు. బీసీసీఐకి ఓ విధానం అంటూ ఉంటుందని, జట్టు దానిని అనుసరించాల్సి ఉంటుందని కోహ్లీ స్పష్టం చేశాడు.
కోచ్ గురించి తమ అభిప్రాయం అడిగితేనే బీసీసీఐకి సలహాలు ఇస్తామని వివరించాడు. ప్రస్తుతం తమ లక్ష్యం విండీస్‌పై సిరీస్ నెగ్గడమేనని పేర్కొన్నాడు. కాగా, టీమిండియా కోచ్ రేస్‌లోకి అనూహ్యంగా దూసుకొచ్చిన భారత జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రికి కోచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. కోహ్లీతో అతడికి సత్సంబంధాలు ఉండడంతో అతడికే ఆ అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.