: రిటైర్డ్ డీజీ కోటేశ్వరరావుకి బెదిరింపులు... కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి కేసులో కొత్తకోణం!
ఇటీవల ఆత్మహత్య చేసుకున్నకుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ డీజీ కోటేశ్వరరావుని ప్రభాకర్ రెడ్డి నాడు బెదిరించిన సంఘటన తాజాగా తెలిసింది. తాను బంజారాహిల్స్ ఎస్సైనంటూ రిటైర్డ్ డీజీని బెదిరించడమే కాకుండా, ఆయన కూతురు శ్వేత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సమాచారం. ఈ విషయాన్ని రిటైర్డ్ డీజీ కోటేశ్వరరావు కూతురు శ్వేత ఓ న్యూస్ ఛానెల్ కు తెలిపారు. ఈ సందర్భంగా నాడు జరిగిన ఓ సంఘటనను శ్వేత ప్రస్తావించింది.
ఆమె కథనం ప్రకారం, సదరు డీజీ బంజారాహిల్స్ లోని తన భవనాన్ని గతంలో అద్దెకు ఇచ్చారు. అయితే, అందులో హుక్కా సెంటర్, వ్యభిచారం నడుస్తోందని తెలిసి ఖాళీ చేయమని కోరారు. ఈ క్రమంలో ఓ రోజు తమ భవనం వద్దకు శ్వేత వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్సై ప్రభాకర్ రెడ్డిని చూసి శ్వేత ‘నువ్వెవరు?’ అంటూ నిలదీసింది. బంజారాహిల్స్ ఎస్ఐ వినోద్ గౌడ్ పుష్కరాల డ్యూటీకి వెళ్లినందున, ఆయన స్థానంలో ఇన్ ఛార్జ్ ఎస్సైగా తాను వచ్చానని ప్రభాకర్ రెడ్డి సమాధామిచ్చారు.
దీంతో, తన తండ్రితో ప్రభాకర్ రెడ్డిని ఫోన్ లో మాట్లాడించటం జరిగింది. కోటేశ్వరరావు తాను రిటైర్డ్ డీజీనని చెప్పినప్పటికీ, సెటిల్ మెంట్ చేసుకోవాలని ప్రభాకర్ రెడ్డి బెదిరించాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య తర్వాత ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఫొటోలు బయటకు రావడంతో వాటిని గుర్తుపట్టినట్టు శ్వేత ఆ ఛానెల్ కు చెప్పింది.