: యూట్యూబ్ లో ఫేమస్ అయిపోవాలని ప్రయత్నం చేసిన అమ్మాయి.. బోయ్ ఫ్రెండ్ ప్రాణాలు పోయాయి!
యూ ట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేసి పాప్యులారిటీ సంపాదించుకోవాలని యువత పిచ్చి పిచ్చి ప్రయత్నాలు జరుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. ప్రపంచంలో ఎవ్వరూ చేయని విధంగా వినూత్నంగా ఏదైనా చేసేయాలని తహతహలాడుతోంది. ఇటువంటి ప్రయత్నమే చేసిన ఓ అమ్మాయి.. తన ప్రేమికుడి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. 19 ఏళ్ల మోనాలిసా అనే అమెరికా అమ్మాయి, మిన్నసొటలో స్థానికులంతా చూస్తుండగా ప్రమాదకరమైన స్టంట్ చేయాలనుకుంది.
తాను రేపు ఉదయం ఓ డేంజరస్ స్టంట్ చేస్తానని మొన్న రాత్రి తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆ అమ్మాయి, చెప్పినట్లుగానే తన బోయ్ ఫ్రెండ్‌తో ఆ పని చేయడానికి సిద్ధమైంది. కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకుంది అయితే, ఆ స్టంట్ బెడిసిగొట్టింది. ఆమె ఆ స్టంట్‌ను ఎలా చేయాలని అనుకుందో ఏమో... తన బాయ్ ఫ్రెండ్ పెడ్రో రూయిజ్ ఛాతి ముందు ఓ పుస్తకం పెట్టింది. ఆ పుస్తకంపై గన్‌తో షూట్ చేసింది. ఆ బుల్లెట్ ఆ యువకుడి ఛాతిలోకి దూసుకెళ్లింది. అందరూ చూస్తుండగానే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి, ఈ దృశ్యాలను చిత్రీకరించిన ఆ కెమెరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.