: అన్నం పెట్టి.. రెండు వేల రూపాయలు ఇచ్చి.. బాలుడిని సొంత ఊరికి పంపించిన పోలీస్!
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద ఇటీవల రాత్రి పూట ఓ బాలుడు ఒంటరిగా ఏడుస్తూ నిల్చున్నాడు. అంతా ఆ బాలుడిని చూస్తూ వెళ్లిపోతున్నారే తప్పా.. ఏమయిందని, సాయం కావాలా? అని ఎవరూ అడగలేదు. కానీ, ఆ బాలుడిని గుర్తించిన ఓ ఎస్సై మాత్రం తనకెందుకులే అని వదిలేయలేదు. ఆ బాలుడికి సాయం చేసి నిజమైన పోలీస్ అనిపించుకున్నారు. ఆ బాలుడిని అక్కడ ఎందుకు ఉన్నావని అడిగారు. ఆ బాలుడు చెప్పిన కథకి చలించిపోయిన ఆ పోలీసు వెంటనే అతడికి అన్నం తినిపించారు. ఆ తర్వాత పుస్తకాలు కొనుక్కోమని రూ. 2వేలు ఇచ్చారు. ఆ బాలుడు ఎక్కడినుంచి వచ్చాడో కనుక్కొని తిరిగి బస్సు ఎక్కించి పంపించారు. ఆ బాలుడికి ఏదైనా అవసరముంటే ఫోన్ చేయమని తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగమల్లు చూపిన మానవత్వం ఇది. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఆ బాలుడి వద్దకు తాను వెళ్లి ఏమైందని అడిగానని, తన అమ్మమ్మ వాళ్లు హైదరాబాద్‌లో పూల మొక్కలు అమ్ముకుంటూ ఉంటారని, వాళ్లని చూసేందుకే తాను వినుకొండ అనాథాశ్రమం నుంచి వచ్చానని తనతో ఆ 11 ఏళ్ల బాలుడు చెప్పాడని తెలిపారు. హైదరాబాద్ కు వచ్చి చూసేసరికి వాళ్లు వేరే ఊరికి వెళ్లినట్లు తెలిసిందని ఆ బాలుడు తనతో చెప్పాడని తెలిపారు. ఆ బాలుడి అమ్మమ్మ కుటుంబ సభ్యుల వద్ద ఫోన్ కూడా లేదని తనతో చెప్పాడని ఆ పోలీస్ తెలిపారు. ఆ బాలుడి పేరు పులి నాని అని, అతడికి తల్లిదండ్రులు లేరని చెప్పారు.