: ఆస్కార్ ఓటింగ్ లిస్ట్‌లో షారుఖ్ పేరేది?
ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారు 774 మందికి కొత్తగా ఓటింగ్ బాడీ ఆహ్వానాలు పంపించారు. ఇందులో చాలా మంది భారతీయ నటులు, టెక్నీషియన్లు ఉన్నారు. వీరిలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్‌లతో పాటు దీపికా పడుకొనె, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్ , సల్మాన్ ఖాన్‌లు ఉన్నారు. షారుఖ్ ఖాన్ పేరు లేకపోవడం గమనార్హం.
ఆస్కార్ ఓటింగ్ బాడీ నిర్మాణంలో వైవిధ్యత చూపించడానికి గతేడాది 683 ఆహ్వానాలు పంపించారు. ఈ ఏడాది వాటి సంఖ్య పెంచుతూ ప్రపంచ నలుమూలల నుంచి 774 మందికి ఆహ్వానాలు పంపించారు. దర్శకులు మృణాల్ సేన్, బుద్ధదేవ్ దాస్‌గుప్త, గౌతమ్ ఘోష్, రచయిత సూనీ తారాపూర్‌వాలా, కాస్ట్యూమ్ డిజైనర్ అర్జున్ బేసిన్, డాక్యుమెంటరీ మేకర్ ఆనంద్ పట్వర్థన్, సౌండ్ డిజైనర్ అమృత్ ప్రీతం దత్తాల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.
`ఆస్కార్ మొత్తం తెల్లవాళ్ల మయం` అంటూ రెండేళ్ల క్రితం వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఈసారి 30 శాతం మంది నాన్ వైట్‌లకు జాబితాలో చోటు కల్పించారు. అలాగే పురుషాధిక్యతపై వచ్చిన విమర్శలకు సమాధానంగా 39 శాతం మంది మహిళలను ఎంపిక చేశారు. ఈ జాబితాలో స్థానం దక్కించుకోవాలంటే సినీరంగానికి చెందిన వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపించి ఉండాలి.