: నీళ్లు అనుకొని యాసిడ్ తాగిన చిన్నారులు!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఇద్దరు విద్యార్థులు బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకొని యాసిడ్ తాగి ఆసుపత్రి పాలయ్యారు. వారి నోరు, గొంతు భాగాల్లో అయిన తీవ్రగాయాలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, మోత్కూరు ప్రైవేట్ పాఠశాల సమీపంలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు పలు యాసిడ్ బాటిళ్లు పెట్టారు. అయితే, దాహంతో ఆ ప్రాంతానికి వెళ్లిన సాగర్ (11), మణి (4) అనే విద్యార్థులు ఆ బాటిళ్లలో నీళ్లున్నాయనుకొని యాసిడ్‌ను తాగేశారు. ఆ పిల్లలు గాయాలపాలయిన విషయాన్ని తెలుసుకున్న స్కూల్ సిబ్బంది వెంటనే వారిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సాగర్ ఆ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడని, మణి ఇంకా ఆ స్కూల్లో జాయిన్ కాలేదని, అయినప్పటికీ స్కూల్ వద్దకు వచ్చాడని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.