: ఏపీకి వెళ్లిపోయిన ఆంధ్రా అధికారులు మళ్లీ వస్తామంటున్నారు... అడ్డుకుంటామన్న తెలంగాణ ఉద్యోగులు
రాష్ట్రం విడిపోయిన తరువాత కేటాయింపుల్లో భాగంగా ఏపీకి వెళ్లిపోయిన ఆంధ్రా ఉద్యోగులు, ఇప్పుడు తిరిగి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నారని, వారు వస్తే, తమకు వచ్చే ప్రమోషన్లు ఆగుతాయని ఆరోపిస్తూ, అటువంటి ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని తెలంగాణ ఎన్జీవో నాయకులు హెచ్చరించారు. ఈ ఉదయం సెక్రటేరియేట్ లో నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం టీఎన్జీవో సచివాలయ యూనిట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సురేశన్ లు మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలో 240 మంది సెక్షన్ ఆఫీసర్లుండగా, వారిలో 24 మంది ఆంధ్రా అధికారులను ఏపీకి పంపి, 89 మంది ఆంధ్రా అధికారులను ఇక్కడే కొనసాగిస్తున్నారని గుర్తు చేసిన వారు, ఏపీకి వెళ్లిన వారంతా తిరిగి ఇక్కడికే వచ్చేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో వారిని తీసుకోమంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కారు స్వయంగా లేఖ రాసిందని చెబుతూ, వారిని తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సెక్రటేరియట్ లో వారిని తిరిగి నియమించే ప్రయత్నాలను చేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలిపారు.