: హీరోయిన్ రేప్ కేసులో నటుడు దిలీప్ ను 12 గంటలు విచారించిన పోలీసులు
ప్రముఖ మలయాళ నటిపై అత్యాచారం కేసులో విచారణకు కేరళ ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు నటుడు దిలీప్ ను 12 గంటల పాటు విచారించారు. దిలీప్ తో పాటు మరో నటుడు నాదిర్షా, వారి మేనేజర్ అపుని లను అలువా పోలీస్ క్లబ్ లో నిన్న మధ్యాహ్నం 12.30 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ ప్రశ్నించారు. ఆపై వారిని ఇంటికి వెళ్లేందుకు అనుమతించి, అవసరమైతే మరోసారి విచారిస్తామని తెలిపారు. ఈ కేసు వెనుక దిలీప్ ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
"నిజం అతి త్వరలోనే బయటకు వస్తుందని నేను నమ్మకంగా ఉన్నాను. పోలీసులకు పూర్తిగా సహకరించాను. వారు మరోసారి విచారణకు రమ్మంటే వెళ్తాను. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు నన్ను దోషిగా చూస్తున్నారు. దయచేసి తప్పుడు కథనాలు వేసి జరిగిన ఘటనలను మార్చవద్దు. నన్ను బ్లాక్ మెయిల్ చేసిన వారిపైనా పోలీసులకు ఫిర్యాదు చేశాను" అని దిలీప్ మీడియాతో వ్యాఖ్యానించారు. అడిషనల్ డీజీపీ బీ సంధ్య, ఎర్నాకులం రూరల్ ఎస్పీ ఏవీ జార్జ్, పెరంబవూరు సర్కిల్ సీఐ బైజూ పావులోస్ లు వీరిని ప్రశ్నించారు.