: యోగా ప్రయోజనాలపై సిడ్నీ పరిశోధకుల అనుమానం!
శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో తోడ్పడుతుందని యోగసాధకులు చెబుతుంటారు. ఇటీవలి కాలంలో యోగాపై నమ్మకం పెరుగుతుండడానికి తోడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో యోగా శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుందన్న నమ్మకం నూటికి నూరు పాళ్లూ నిజం కాకపోవచ్చని ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ మేరకు బాడీ వర్క్ అండ్ మూవ్ మెంట్ ధెరపీస్ జర్నల్ లో ఒక కథనం వెలువడింది. ఈ కథనంలో కండరాలు, ఎముకల నొప్పులకు యోగా కారణమవుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న గాయాలను యోగా మరింత పెద్దగా చేస్తోందని వారు ఆరోపించారు. యోగా చేసేవారిలో ఒళ్లు నొప్పులతో బాధపడేవారి సంఖ్య ఏటా పది శాతానికి పైగానే ఉంటోందని తమ అధ్యయనంలో తేలిందని వారు వెల్లడించారు. దీంతో యోగాసాధనతో రుగ్మతలను అధిగమించవచ్చన్నది నూటికి నూరుపాళ్లు నిజం కాకపోవచ్చని వారు తెలిపారు.