: ఆర్జేడీ సీనియర్ నేతపై చేయి చేసుకున్న లాలు తనయుడు.. బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించిన నేత!
ఆర్జేడీకి ఆ పార్టీ నేత సనోజ్ యాదవ్ ఝలక్కిచ్చారు. త్వరలో తాను బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 23న ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్ తనయుడు, ఆరోగ్య శాఖామంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తనపై దాడి చేసినట్టు ఆయన ఆరోపించారు. లాలు తన నివాసంలో ఇచ్చిన ఇఫ్తార్ విందులో తేజ్ ప్రతాప్ తనపై దాడిచేసినట్టు చెప్పారు. పార్టీకి 30 ఏళ్లు సేవ చేసిన తనకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదని సనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
లాలు కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై జూన్ 22న ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సనోజ్ యాదవ్ పాల్గొన్నారు. అయితే అవినీతి ఆరోపణలను తిప్పికొట్టడంలో ఆయన విఫలమయ్యారు. ఇది తేజ్ ప్రతాప్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇఫ్తార్ విందులో అతడు కనిపించడంతో అప్పటికే అతడిపై కోపంగా ఉన్న తేజ్ ప్రతాప్ దుర్భాషలాడుతూ దాడి చేశారు. తనపై దాడి జరుగుతున్నా లాలు ధృతరాష్ట్రుడిలా కూర్చుండిపోయారని సనోజ్ ఆరోపించారు. తనను ఆపేందుకు ప్రయత్నించలేదని అన్నారు. ఆ ఘటన అనంతరం పార్టీ సభ్యత్వానికి, అన్ని పదవులకు ఆయన రాజీనామా చేశారు. తేజ్ ప్రతాప్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరలో తాను బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు.