: ‘శ్రీమంతుడు’ వివాదం.. మహేశ్‌బాబుకు మరోసారి కోర్టు సమన్లు
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా గతంలో విడుదలైన ‘శ్రీమంతుడు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే, తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవలను కాపీ కొట్టి ఈ సినిమా నిర్మించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన విషయమూ విదితమే. ఈ కథ వివాదానికి సంబంధించిన కేసులో సినీ నటుడు మహేశ్ బాబుకు, నిర్మాత ఎర్నేని శివకు నాంపల్లి కోర్టు మరోమారు సమన్లు జారీ చేసింది.
ఈ క్రమంలో ఈ రోజు మహేశ్ కోర్టుకు హాజరవుతారని భావించారు. కానీ, ఆయన రాకపోవడంతో ఆగస్టు 7న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఎంబీ క్రియేషన్స్ తరపున గిరిధర్ అనే వ్యక్తి హాజరవుతారంటూ ఆ సంస్థ డైరెక్టర్ నమ్రత కోరడంపై శరత్ చంద్ర తరపు న్యాయవాది శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, శ్రీమంతుడు చిత్ర దర్శకుడు కొరటాల శివకు హైకోర్టు ఇచ్చిన మినహాయింపు ఉత్తర్వుల్లో సాంకేతిక లోపాలు ఉండటంతో ఆ స్టేను న్యాయస్థానం నిరాకరించింది. అందులో లోపాలను సవరించుకునేందుకు కొంత గడువు ఇచ్చింది. కాగా, 2015లో శ్రీమంతుడు చిత్రం విడుదలైంది. మహేశ్ సరసన శ్రుతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, జగపతిబాబు తదితరులు నటించారు.