: నెదర్లాండ్ తో కీలక ఒప్పందాలు.. ఆ దేశం భారత్ కు అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని మోదీ వ్యాఖ్య
అమెరికా పర్యటన ముగించుకుని నెదర్లాండ్‌కు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధానమంత్రి మార్క్ రట్టేతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడుతూ... భారత్‌కు నెదర్లాండ్ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని అన్నారు. ఇరు దేశాలు ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం వ్యాపారాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళతాయని అన్నారు. ఈ రోజు ఇరు దేశాల అగ్రనేతలు సామాజిక భద్రత, వాటర్ కోపరేషన్, సంస్కృతి, సహకారం వంటి అంశాలపై అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
మిసైల్ టెక్నాలజీకి కంట్రోల్ రెజిమ్ (ఎంటీసీఆర్) లో సభ్యత్వం కోరిన భారత్‌కు నెదర్లాండ్ మద్దతు ఇచ్చినందుకు ఆ దేశానికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు. ఆ దేశ మద్దతుతోనే భారత్ ఎంటీసీఆర్‌లో సభ్యత్వం పొందిందని చెప్పారు. నెదర్లాండ్ ప్రధాని రట్టే మాట్లాడుతూ భారత్‌ను ఆకాశానికెత్తేశారు. ఇండియా ఓ ప్రపంచశక్తిగా అవతరిస్తోందని, రాజకీయంగా, ఆర్థికంగా భారత్ ఎదగడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. భారత ప్రభుత్వం అమలుపరుస్తోన్న కార్యక్రమాలను ఆయన కొనియాడారు. భారత లక్ష్యాల సాధనకు తమ దేశం కూడా సాయం అందిస్తుందని చెప్పారు.