: టీచర్ల బదిలీ ప్రిన్సిపాల్ చేతికి.... ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం విద్యా సంస్కరణల పర్వంలో భాగంగా మరో అడుగు వేసింది. ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల విధివిధానాలతో సహకరించని ముగ్గురు ఉపాధ్యాయుల బదిలీకి సిఫారసు చేసే అధికారాన్నిపాఠశాల ప్రిన్సిపాల్/వైస్ ప్రిన్సిపాల్/ ప్రధానోపాధ్యాయులకు ఢిల్లీ ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే, ఈ ఆదేశంపై ప్రభుత్వ పాఠశాలల అధిపతులు, ఉపాధ్యాయులు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఇది పాఠశాల అభివృద్ధికి చాలా ఉపయోగకరం అంటూ అధిపతులు చెబుతుండగా, ఈ ఆదేశాన్ని ఎక్కువ శాతం మంది ప్రిన్సిపాళ్లు దుర్వినియోగపరిచే అవకాశం ఉందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఏదేమైనా విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికే ఢిల్లీ ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది.