: ఉడుపి మఠంలో ముస్లింల నమాజ్ ... ఆతిథ్యమిచ్చినందుకు శ్రీరామ సేన నిప్పులు
ఇండియాలో హిందూ, ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది కర్ణాటక ఉడుపిలోని శ్రీకృష్ణ దేవాలయం. అయితే, ఈ ఘటనపై అంతే స్థాయిలో విమర్శలూ వస్తున్నాయి. రంజాన్ ఉపవాసాల సందర్భంగా పెజావర మఠం అధిపతి శ్రీ విశ్వేష తీర్థ స్వామీజీ, ముస్లింలకు ఆలయంలో విందు ఏర్పాటు చేశారు. ఉడుపి కృష్ణ దేవాలయ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 'సౌహార్ద ఉపాహార కూట' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన దేవాలయం పక్కనే ఉన్న డైనింగ్ హాల్ లో విందును ఏర్పాటు చేయగా, దాదాపు 150 మంది ముస్లింలు నమాజ్ చేసి, ఆపై అల్పాహారాన్ని స్వీకరించారు.
గుడి డైనింగ్ హాల్ లో నమాజ్ చేసిన అనంతరం రంజాన్ ఉపవాసాలను వారు విరమించారని విశ్వేష తీర్థ వెల్లడించారు. ఇది రెండు మతాల మధ్యా ఉన్న మత సామరస్యానికి నిదర్శనమని అన్నారు. తాను స్వయంగా ముస్లిం సోదరులకు ఖర్జూరం, అరటి పండ్లు, జీడిపప్పు, పుచ్చకాయ, యాపిల్స్ వడ్డించినట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనపై శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ తీవ్రంగా స్పందించారు. హిందూ మతాన్ని పెజావర మఠం అపహాస్యం చేసిందని దుయ్యబట్టారు. దేవాలయంలో ముస్లింలను అనుమతించడమే కాకుండా, నమాజ్ కూడా చేసుకోనిస్తారా? అని నిప్పులు చెరిగారు.