: అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తెద్దాం: చంద్రబాబు, కేసీఆర్ ల నిర్ణయం!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు ఢిల్లీలో ఇటీవల మంతనాలు జరిపారు. ఇరు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వీరిద్దరూ నిర్ణయించారు. జూలై 17 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశ పెట్టేలా ఒత్తిడి తీసుకురావాలని, లేకపోతే పునర్విభజనకు సమయం సరిపోదని ఇద్దరు చంద్రులు భావిస్తున్నారు.
నియోజకవర్గాల పెంపు బిల్లును న్యాయవిభాగం ఇప్పటికే సిద్ధం చేసిందని, ప్రధాని కార్యాలయం ఆదేశాల కోసం కేంద్ర హోంశాఖ ఎదురుచూస్తోందన్న విషయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్న కేసీఆర్... ఈ విషయాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చంద్రబాబుతో ప్రస్తావించారు. సీట్ల పెంపు గురించి తాను ఎప్పటికప్పుడు కేంద్రంతో ప్రస్తావిస్తూనే ఉన్నానని... ఏదో ఒక టెక్నికల్ కారణం చూపి వాయిదావేస్తున్నారని ఈ సందర్భంగా కేసీఆర్ తో చంద్రబాబు అన్నారట.
తన ప్రయత్నం తాను చేస్తున్నానని, ఈ సారి మోదీని కలిసినప్పుడు సీట్ల పెంపు అంశాన్ని మరోసారి లేవనెత్తాలని కేసీఆర్ కు చంద్రబాబు సూచించారట. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ నామినేషన్ వేసే కార్యక్రమానికి హాజరైన సమయంలో ముఖ్యమంత్రులిద్దరి మధ్య ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రధాని మోదీ రావడానికి ముందు వీరిద్దరూ ఈ అంశంపై చర్చించుకున్నారు. వీరిద్దరూ చర్చించుకుంటున్న సమయంలో, ఎన్డీయేకు చెందిన ఇతర నేతలు అక్కడకు రావడంతో, చర్చ అంతటితో ముగిసిందట.