: మీకు ఫొటోలు తీసే అలవాటుందా?.. అయితే మీకో గుడ్ న్యూస్!
మీకు ఫొటోలు తీసే అలవాటు ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్! ఫొటోలు తీసే అలవాటు వల్ల విజువల్ మెమొరీ (దృశ్యాలను గుర్తుంచుకోవడం) మెరుగవుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అయితే ఫొటోలు తీసే అలవాటు దృశ్య సంబంధ విషయాలను గుర్తుంచుకునే తీరును మెరుగుపరిచినా వినే(శ్రవణ సంబంధమైన) అలవాటుకు కొంత చేటు కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన అలెగ్జాండ్రియా బరాష్, యూఎస్సీ మార్షల్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన క్రిస్టిన్ డీల్, వార్తాన్ స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన జాకీ సిల్వర్ మ్యాన్, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్కు చెందిన గాల్ జాబెర్మన్లు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఫొటోలు తీసే అలవాటున్న వారు ఆ అనుభవాలను స్నేహితులతో డిన్నర్ చేస్తున్నప్పుడు, విహారయాత్రల సమయంలోను, మరో సందర్భంలోనూ పంచుకుంటారని వారు తెలిపారు. 294 మందిపై జరిపిన ఈ అధ్యయనంలో పలు ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడైనట్టు వారు తెలిపారు. గతంలో ఎప్పుడో తీసిన ఫొటోలను చూపించినప్పుడు కూడా వాటికి సంబంధించిన విషయాలను వారు పూసగుచ్చినట్టు చెప్పడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. దీనిని బట్టి మనం విన్నదాని కంటే చూసిన విషయమే ఎక్కువ కాలం గుర్తుంటుందని తేలిందని వివరించారు. అయితే అదే సమయంలో అధ్యయనంలో పాల్గొన్న వారు విన్న విషయాలను గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడినట్టు గుర్తించారు. వారికి కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానమిచ్చినట్టు అధ్యయనకర్తలు తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు సైకలాజికల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.