: కోహ్లీని బలిపశువును చేయకండి: అనురాగ్ ఠాకూర్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇంతకాలానికి ఒక మద్దతుదారు కనిపించాడు. కుంబ్లే ఎపిసోడ్ లో కోహ్లీని బలిపశువును చేస్తున్నారని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, హిమాచల్ ప్రదేశ్ ఒలింపిక్ కమిటీ ఛైర్మన్, ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. ప్రస్తుత వివాదంపై సమాధానం చెప్పాల్సింది జట్టు మేనేజ్ మెంట్ అని ఆయన చెప్పారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని ఆయన సూచించారు. రానున్న పదేళ్లు జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాల్సింది విరాట్ కోహ్లీ అని ఆయన చెప్పారు.
గతంలో కూడా కెప్టెన్లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన సందర్బాలున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే దీనిని సమర్ధవంతంగా డీల్ చేసేవాడినని అన్నారు. కుంబ్లేకు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చి ఏవైనా సమస్యలు ఉంటే కొత్త కోచ్ ను నియమించేందుకు కావాల్సిన వెసులుబాటును బోర్డుకు గతంలో కల్పించామని ఆయన తెలిపారు. కుంబ్లే కోచ్ అయిన ఏడు, ఎనిమిది నెలల వరకు తామే బోర్డులో ఉన్నామని, ఆ సమయంలో ఈ విభేదాల గురించి అసలు ఒక్క వార్త కూడా రాలేదని ఆయన తెలిపారు.