: కర్నూలులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బెదిరించడం ఎలా అవుతుంది?: యనమల రామకృష్ణుడు
కర్నూలులో సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని, ఆ వ్యాఖ్యలు ప్రజలను బెదిరించడం ఎలా అవుతుందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు నెరవేర్చినందునే టీడీపీకి సహకరించాలని ప్రజలను ఆయన కోరారని, అందులో తప్పేముందని, అది బెదిరించడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. టీడీపీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
మంత్రి వర్గంలో అసంతృప్తి ఉన్నట్టుగా వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేయడం తగదని, నాయకుడు తన బృందానికి దిశానిర్దేశం చేయడం నియంతృత్వమా?, మంత్రి మండలి, కార్యనిర్వహణ వ్యవస్థకు పూర్తి సమన్వయం ఉందని, మూడేళ్లలో రాష్ట్ర అభివృద్ధి, అవార్డులే ఇందుకు నిదర్శనమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పనులపై వైఎస్సార్సీపీ అడ్డంకులు సృష్టించవద్దని ఈ సందర్భంగా యనమల హెచ్చరించారు.