: ఎయిర్ బ్యాగ్ తెరచుకున్నా దక్కని ప్రాణాలు... రవితేజ సోదరుడు భరత్ మృతిపై మరింత సమాచారం


గత రాత్రి ఔటర్ రింగురోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు, నటుడు భరత్ రాజు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం గురించిన మరింత సమాచారాన్ని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం సమయంలో భరత్ ఒంటరిగా కారును నడుపుకుంటూ వచ్చారని తెలిపారు. ప్రమాదం విషయం అతని స్నేహితులకు తెలిసినప్పటికీ, వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. రోడ్డు పక్కన బ్రేక్ ఫెయిల్ అయిన లారీ ఆగివుండగా, హెచ్చరికగా లారీ వెనుక చెట్టు కొమ్మలను సైతం అమర్చారని, దాన్ని గుర్తించకపోవడమే ప్రమాదానికి కారణమని అన్నారు.

రవితేజ తల్లి రాజ్యలక్ష్మి 'టీఎస్ 09 ఈసీ 0799' నంబరుతో కారు రిజిస్టరై ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ప్రమాదం తరువాత కారులోని ఎయిర్ బ్యాగులు తెరచుకున్నాయని, అధిక వేగం కారణంగా, కారు ముందు భాగం మొత్తం లారీ వెనక చక్రాల కింద వరకూ దూసుకెళ్లడంతో భరత్ మృతదేహం గుర్తించలేని విధంగా ఛిద్రమైందని అన్నారు. ఉదయం ఆయన బంధువులు వచ్చి గుర్తించిన తరువాతనే మరణించిందని నటుడు రవితేజ సోదరుడని తమకు తెలిసినట్టు పేర్కొన్నారు.

కాగా, భరత్ వెంకీ, రెడీ, దూకుడూ, ఆ ముగ్గురూ, రామ రామ కృష్ణ కృష్ణ, జంప్ జిలానీ, చక్రి, అతడే ఒక సైన్యం తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. మరెన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించారు.

  • Loading...

More Telugu News