: ఇక నేను వెళ్లిపోతాను: కాంగ్రెస్ అధిష్ఠానానికి షాకిచ్చిన వాఘేలా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శంకర్ సింగ్ వాఘేలా పార్టీ అధిష్ఠానానికి షాకిచ్చారు. కాంగ్రెస్ నేతలు భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి హోం వర్క్ చేయడం లేదని ఆరోపించిన ఆయన, ఇక తాను పార్టీని వీడిపోతానని హెచ్చరించారు. ఈ సంవత్సరం గుజరాత్ ఎన్నికలు జరగనుండగా, గత ఏడాది కాలంగా పార్టీ ఎంతమాత్రమూ విజయం సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్న ఆలోచనలో లేదని అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పటీదార్లు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల వారు ఉన్నప్పటికీ, వారికి దగ్గరయ్యేందుకు అధిష్ఠానం ఏమీ చేయలేదని ఆరోపించారు. ఈ సంవత్సరం డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, తాను సీఎం పదవికి పోటీ పడటం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో కూర్చున్న వారికి డిసెంబర్ ఎన్నికలు కనిపించడం లేదని, యూపీలో నేర్చుకున్న గుణపాఠం నుంచి వారు బయటపడటం లేదని అన్నారు. తాను త్వరలోనే రాహుల్ గాంధీని కలసి తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయనున్నానని వాఘేలా వ్యాఖ్యానించారు.