: డిమాండ్లకు ఒప్పుకోండి లేదా విడిపోండి.... ఖతార్‌కు యూఏఈ హెచ్చరిక!
ఖతార్, దాని పొరుగుదేశాల ప్రాంతీయ వివాదంలో ఐక్యరాజ్యసమితి కల్పించుకోనుండడంతో తమ డిమాండ్లపై దృష్టి పెట్టాలని, లేకపోతే విడిపోవాలని 13 డిమాండ్లతో యూఏఈ పంపిన హెచ్చరికల జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివాదానికి ఆజ్యం పోసిన అల్ జజీరా ఛానల్‌ను మూసివేయాలనేది 13 డిమాండ్లలో ప్రధానంగా కనిపిస్తోంది. ఇందుకు అల్ జజీరా వారు స్పందిస్తూ ఇది మీడియా స్వాతంత్ర్యాన్ని కాలరాయడమేనని కొట్టిపారేస్తున్నారు.
డిమాండ్ల జాబితా సోషల్ మీడియాలో లీక్ అవడంపై కూడా పొరుగుదేశాలు అల్ జజీరా ఛానల్‌నే తప్పుపడుతున్నాయి. కానీ వారు మాత్రం మధ్యవర్తిత్వం చేస్తున్న కువైట్‌కు డిమాండ్ల జాబితా అప్పగించినట్లు చెప్పుకొస్తున్నారు.
మధ్యప్రాచ్య దేశాల్లో వివాదాలకు కేంద్ర బిందువైన ఇరాన్‌తో దౌత్యసంబంధాలు తగ్గించుకోవడం, ఎమిరేట్‌లోని టర్కీ మిలటరీ స్థావరాన్ని మూసివేయడం, అల్ ఖాయిదా, ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ లాంటి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు తెంచుకోవడం, అలాగే ఉగ్రవాదానికి మద్దతు తెలిపే వార్తా సంస్థలను మూసివేయడం వంటి డిమాండ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.