: జగన్ దరఖాస్తు చేసుకుంటే వైసీపీ కార్యాలయానికి స్థలం కేటాయిస్తాం: మంత్రి చినరాజప్ప
పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలం ఇవ్వడంలో తప్పులేదని, జగన్ దరఖాస్తు చేసుకుంటే వైసీపీ కార్యాలయానికి స్థలం కేటాయిస్తామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖ భూ కుంభకోణంపై సిట్ ద్వారా పూర్తి విచారణ జరిపిస్తామని, చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చాలనే ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
భూ కుంభకోణాల్లో టీడీపీ నేతలున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని, ‘గీతం’ మూర్తితో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తమ సంస్థకు స్థలం కావాలని కాంగ్రెస్ హయాంలోనే ‘గీతం’ మూర్తి దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టనున్న పాదయాత్రకు అనుమతి నిమిత్తం తనకు ఎలాంటి లేఖ రాయలేదని చెప్పారు. పాదయాత్ర నిమిత్తం దరఖాస్తు చేసుకుంటే సంతకం చేస్తానని ఈ సందర్భంగా చినరాజప్ప అన్నారు.