: కుంబ్లే స్థానాన్ని భర్తీ చేయగలిగేది సెహ్వాగ్ మాత్రమే: అజిత్ వాడేకర్
టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి క్రికెట్ అడ్వైజరీ కమిటీ మళ్లీ కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కుంబ్లే స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేయగల సత్తా ఒక్క వీరేంద్ర సెహ్వాగ్‌కి మాత్రమే ఉందని భారత జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ తెలిపారు.
`భారత కోచ్‌గా నేను ఇప్పటికీ అనిల్‌నే ఎంచుకుంటాను. ఇందుకు గతేడాది భారత జట్టు సాధించిన విజయాలే కారణం. కుంబ్లే తర్వాత జట్టు కోచ్‌గా ఎవరుండాలనే విషయానికి వస్తే మాత్రం నేను సెహ్వాగ్‌ను ఎంచుకుంటాను` అని వాడేకర్ అన్నారు. `నేను కోచ్‌గా ఉన్నపుడు అనిల్ జట్టులో ఉన్నాడు. అతను చాలా మంచి ఆటగాడు. విజయం కోసం ఎంతటి కష్టమైనా పడతాడు. అతని రాజీనామా వార్త విని చాలా ఆశ్చర్యపోయాను. విరాట్ కోహ్లీ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. త్వరలో విరాట్ తన తప్పు తెలుసుకుంటాడు` అని వాడేకర్ వాపోయారు.
అజిత్ వాడేకర్ 1992-96 మధ్యకాలంలో భారత జట్టు కోచ్‌గా వ్యవహరించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017తో కుంబ్లే పదవీకాలం ముగియడంతో జట్టుతో కలిసి తర్వాత జరగబోయే వెస్టిండీస్ టూర్‌కు కుంబ్లే వెళ్లలేదు. ఈ టూర్లో భాగంగా భారత జట్టు 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది.