: నిఘా వ్యవస్థను సమూలంగా మార్చే 22 గార్డియన్ డ్రోన్లను ఇండియాకు ఇచ్చేందుకు అమెరికా అంగీకారం
భారత నిఘా వ్యవస్థను, ముఖ్యంగా సరిహద్దుల్లో చొరబాట్లను అనుక్షణం కనిపెట్టగలిగే అత్యాధునిక మానవ రహిత విమానాలను భారత్ కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. రెండు మూడు బిలియన్ డాలర్ల విలువైన డీల్ లో భాగంగా 22 గార్డియన్ డ్రోన్లను భారత్ కు అందించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తొలిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలుసుకోబోతున్న సమయంలో ఈ డీల్ కుదరడం గమనార్హం.
ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఇరు దేశాల మధ్య కుదిరిన అతిపెద్ద డీల్ కూడా ఇదే. భారత్ కు మేజర్ డిఫెన్స్ పార్టనర్ గా అమెరికా ఆవిర్భవించిందని, భవిష్యత్తులో మరిన్ని భారీ డీల్స్ కుదిరే అవకాశాలు ఉన్నాయని యూఎస్ రక్షణ రంగ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ నెల 26న వైట్ హౌస్ లో మోదీ, ట్రంప్ ల మధ్య సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ గార్డియన్ డ్రోన్లను పాక్ సరిహద్దులతో పాటు, భారత నౌకాదళం కూడా వాడుకోనుంది.