: 'ఉగ్రవాదినే' అంటున్న జాదవ్ వీడియో విడుదల... అంతా పాక్ దుర్మార్గపు పన్నాగమన్న భారత్
భారత్ నుంచి పాకిస్థాన్ కు వచ్చి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ, మరణదండన విధించిన కులభూషణ్ జాదవ్, తన నేరాన్ని అంగీకరిస్తున్న రెండో వీడియోను పాక్ సైన్యం విడుదల చేసింది. ఆ వెంటనే భారత్ స్పందిస్తూ, ఇదంతా తప్పుడు ప్రచారమని, పాక్ దుర్మార్గంలో భాగంగా విడుదలైన బూటకపు వీడియో ఇదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనకు క్షమాభిక్ష పెట్టాలని జాదవ్ పిటిషన్ పెట్టుకున్న తరువాత పాక్ సైన్యం విడుదల చేసిన ఈ వీడియోపై విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే స్పందించారు.
ఏ మాత్రం పారదర్శకత లేకుండా, నిజాలను తొక్కి పెట్టి, తప్పుడు ఆరోపణలు చేస్తూ, జాదవ్ కు కనీస న్యాయ సహాయాన్ని కూడా అందించడం లేదని ఆయన ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘన జాదవ్ అంశంలో స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కాగా, జాదవ్ కు మరణదండనపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించగా, అతనికి శిక్ష అమలును తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ నిలుపుదల చేయాలని న్యాయమూర్తులు పాకిస్థాన్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే.