: రాజకీయాల్లోకి రాబోనని చెప్పట్లేదు: రజనీ నోట సంచలన మాట
తక్షణం రాజకీయాల్లోకి రావాలని అభిమానులు, తమిళ ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ, చెన్నై ఎయిర్ పోర్టులో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రాబోనని చెప్పడం లేదని. ఈ విషయంలో చర్చలు సాగుతున్నాయని ఆయన అన్నారు. గత నెలలో అభిమానులతో సమావేశమైన రజనీకాంత్, "యుద్ధానికి సిద్ధం కండి" అని వ్యాఖ్యానించిన తరువాత, ఆయన రాజకీయ ప్రవేశంపై వార్తలు వెల్లువలా వచ్చిన సంగతి తెలిసిందే.
"యుద్ధం వస్తే, మాతృభూమిని కాపాడుకునేందుకు మీరంతా ముందుకు వస్తారని నాకు తెలుసు. నేనో వృత్తిలో ఉన్నాను. ఈ సమయంలో పనే ముఖ్యం. మీరు కూడా మీ ఊర్లకు వెళ్లి, మీ విధులు నిర్వర్తించండి. యుద్ధం వచ్చిన వేళ చూసుకుందాం" అని ఆయన అన్నారు. రజనీకాంత్, బీజేపీతో కలుస్తారని, సొంతంగా పార్టీ పెడతారని, పార్టీ పెట్టి పళనిస్వామితో కలసి పని చేస్తారని ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
ఇక పి.అయ్యకన్ను నేతృత్వంలోని 16 మంది రైతులు రజనీని కలిసి నదుల అనుసంధానానికి సహకరించాలని కోరగా, తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన రజనీ, రైతుల ఆంకాంక్షను ప్రధాని దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. రజనీ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం స్పందించారు. మంచి వారికి రాజకీయాల్లో ఎప్పటికీ స్థానం ఉంటుందని అనడం గమనార్హం. కాగా, ప్రస్తుతం 66 ఏళ్ల వయసులో ఉన్న రజనీ, అక్టోబరులో మరోసారి అభిమానులతో సమావేశమై, రాజకీయాలపై నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.