: చిన్నారి క్షేమంగా బయటకు రావాలంటూ ప్రార్థనలు చేస్తున్న గ్రామస్తులు... ఓ గంటలో రానున్న కొచ్చి నిపుణులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిన 14 నెలల చిన్నారి మీనా క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటూ గ్రామస్తులంతా ప్రార్థనలు చేస్తున్నారు. పాపలో కదలికలు లేవని చెప్పడంతో నిన్న రాత్రి నుంచి పాప క్షేమంగా రావాలని కోరుకుంటూ ఎదురు చూస్తున్న గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. అయితే పాప ఏడ్చిఏడ్చి అలసి నిద్రపోయి ఉంటుందని అధికారులు ఆశలు రేపడంతో మిణుకుమిణుకుమంటున్న ఆశలతో దేవుడ్ని వేడుకుంటున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అంతా అక్కడికే చేరుకున్నారు. అవసరం అనుకుంటే ఎలాంటి సహాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, సీఐఎస్ఎఫ్, రెవెన్యూ తదితర యంత్రాంగం సహాయకచర్యలు చేస్తున్నారు. కొచ్చి నుంచి ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన నిపుణులు మరో గంటలో చేరుకోనున్నారని అధికారులు తెలిపారు.