: ఏం? ఎగతాళిగా ఉందా? కథలు చెబుతున్నారు? : కొడనాడు ఎస్టేట్ కేసు నిందితుల లాయర్ ను హెచ్చరించిన జడ్జి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో దోపిడీకి పాల్పడి, వాచ్ మెన్ ను హత్యచేసిన 11 మంది నిందితుల న్యాయవాది వారికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో చేసిన వాదనలు... గతంలో పెద్దలు చెప్పిన ‘‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ మేత కోసం’’ సామెతను గుర్తు చేశాయి. ఆ వివరాల్లోకి వెళ్తే... కొడనాడు ఎస్టేట్ లో గత ఏప్రిల్ 24వ తేదీన జరిగిన దోపిడీకి, వాచ్ మెన్ ఓంబహదూర్ హత్య నిందితులకు సంబంధం లేదని ఊటీ జిల్లా కోర్టులో న్యాయవాది వాదించారు. ఆ రాత్రి కొడనాడు ఎస్టేట్ కు నిందితులు వెళ్లడం నిజమేనని, అయితే వారు దోపిడీ కోసం అక్కడికి వెళ్లలేదని ఆయన చెప్పారు. జయలలిత ఆత్మ కొడనాడు ఎస్టేట్ లో తిరుగుతోందని కథనాలు ప్రచారంలో ఉన్నాయని, ఆమె ఆత్మను చూసి, శాంతి పూజలు చేద్దామని వెళ్లారని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీనిపై ప్రభుత్వ న్యాయవాది మండిపడ్డారు. 'మరి పూజలు చేశారా?' అని అడిగారు. జయలలిత ఆత్మ కనిపించిందా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. న్యాయస్థానానికి నిందితుల తరపు న్యాయవాది అసత్యాలు చెబుతున్నారని ప్రభుత్వ లాయర్ న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ప్రభుత్వ లాయర్ వాదనలను సమర్థిస్తూ, కట్టుకథలు చెప్పడం మాని సక్రమమైన వాదనలు వినిపించాలని న్యాయమూర్తి నిందితుల తరపు లాయర్ ను హెచ్చరించారు.
అనంతరం కేరళకు చెందిన తాంత్రికుడు సంతోషసామి, జితన్ జాయ్, మనోజ్ సామి, షంషీర్ అలీలకు బెయిల్ నిరాకరించారు. కాగా, కొడనాడు ఎస్టేట్ లో జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ నేతృత్వంలో 11మంది దుండగులు దోపిడీకి పాల్పడి, ఆ ఎస్టేట్ వాచ్ మెన్ ఓం బహదూర్ ను దారుణంగా హతమార్చారు. అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు కనకరాజ్ సేలం సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.