: నేను ఇప్పటికీ ముఖ్యమంత్రి స్పీడుని అందుకోలేకపోతున్నా: లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
చిత్తూరు జిల్లాలో పర్యటిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రేణిగుంటలో సెల్‌ఫోన్‌ల తయారీ సంస్థ సెల్‌కాన్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. 67 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు 20 ఏళ్ల యువకుడిలా స్పీడుగా ఉన్నారని అన్నారు. తాను మంత్రి అయి 80 రోజులయిందని, తన వయసు 34 మాత్రమేనని, అయినప్పటికీ తాను ముఖ్యమంత్రి స్పీడుని అందుకోలేకపోతున్నానని లోకేశ్ అన్నారు.
భారత్‌లోనే ఏ ముఖ్యమంత్రీ ఇంత స్పీడుగా లేరని లోకేశ్ కొనియాడారు. ఐటీలో రాబోయే రెండు సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలు తీసుకొస్తామని అన్నారు. అలాగే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఐదు లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రాష్ట్రానికి ఆదాయం లేదని, అయినప్పటికీ ఏ మాత్రం అధైర్యపడకుండా తమ ప్రభుత్వం అభివృద్ధిని సాధిస్తోందని చెప్పారు.