: చిట్టిపొట్టి డ్రెస్సులకే వ్యతిరేకమనే నేను... లిప్ లాక్ ను ఎలా ఒప్పకుంటాను?: మంజిమా మోహన్
గ్లామర్ కు, అశ్లీలానికి మధ్య సన్నని అడ్డుతెర ఉందని వర్థమాన సినీ నటి మంజిమా మోహన్ తెలిపింది. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నాగచైతన్యతో జతకట్టిన మంజిమ త్వరలోనే మరోతెలుగు సినిమాలో కనిపిస్తానని చెప్పింది. ఈ మధ్యనే లిప్ లాక్ కి కూడా సిద్ధమని స్టేట్ మెంట్ పై వివరణ ఇస్తూ, తాను ఒకటి చెబితే, మీడియాలో మరొకటి వచ్చిందని తెలిపింది. సినిమా ప్రేక్షకుల అభిరుచుల్లో తేడా వచ్చిందని తెలిపింది.
ప్రేక్షకులు గ్లామర్, అశ్లీలానికి మధ్య తేడాను గుర్తిస్తారని చెప్పింది. గ్లామర్ పేరుతో చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తాను లిప్ లాక్ ను ఎలా అంగీకరిస్తానని తిరిగి ప్రశ్నించింది. సినిమా అవకాశాలు లేకపోతే ఇంట్లో కూర్చుంటానే తప్ప కుటుంబం మొత్తం చూడలేని సినిమాలు చేయలేనని స్పష్టం చేసింది. అలా అని తాను గ్లామర్ పాత్రలను అంగీకరించనని కాదని, గ్లామర్ వేరు.. అశ్లీలం వేరు అని చెప్పింది. కాగా, బాలనటిగా మల్లూవుడ్ లో అడుగుపెట్టిన మంజిమ ఎంపిక చేసిన చిత్రాల్లో మాత్రమే నటిస్తున్న సంగతి తెలిసిందే.