: రేపల్లె ప్యాసింజర్ రైలు ఇక ఎక్స్ ప్రెస్... రైల్వే శాఖ నిర్ణయం
తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు, ముఖ్యంగా అమరావతి ప్రాంతాన్ని కలుపుతూ, సామాన్యుల ప్రయాణ అవసరాలను తీరుస్తున్న రేపల్లె ప్యాసింజర్ రైలు ఇకపై ఎక్స్ ప్రెస్ గా మారనుంది. ఈ మేరకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా, అక్టోబరు 19 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇదే సమయంలో రైలు వేగాన్ని కూడా పెంచామని, గంట ముందుగానే రైలు గమ్యానికి చేరుతుందని వెల్లడించింది.
హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు కాచిగూడ - రేపల్లె ఎక్స్ ప్రెస్ గా, అటు నుంచి వచ్చేటప్పుడు రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ గా దీనికి నామకరణం చేశారు. రోజూ రాత్రి 10.10కి కాచిగూడలో బయలుదేరే రైలు తెల్లవారుజామున 6.10కి రేపల్లె చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 10.30కి బయలుదేరి ఉదయం 7.55కు సికింద్రాబాద్ వస్తుందని అధికారులు తెలిపారు.