: సౌదీలో భారతీయులపై ‘పన్ను’ పోటు!


సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులపై అక్కడి ప్రభుత్వం కొత్త పన్నును విధించనుంది. జులై 1 నుంచి ‘డిపెండెంట్ ఫీ’ పేరిట ఈ పన్నును వేయనున్నట్టు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించినట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనం. సౌదీలో నివసించే ప్రతి భారతీయుడు ప్రతీ నెలా 100 రియాల్స్ ను పన్నుగా చెల్లించాలి. మన దేశ కరెన్సీ ప్రకారం దాని విలువ రూ.1,700. కాగా, 5000 రియాల్స్ జీతం ఉన్న కుటుంబాలకు మాత్రమే సౌదీ అరేబియా రెసిడెన్స్ వీసాను మంజూరు చేస్తుంది. ఉదాహరణకు.. భర్త, భార్య, ఒక పాప లేదా బాబుతో ఉన్న ఓ కుటుంబం సౌదీలో నివసిస్తుంటే ఆ ఫ్యామిలీ నెలకు 300 రియాల్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ టాక్స్ విధానం 2020 వరకు అమల్లో ఉంటుంది.

అంతేకాకుండా, ఓ  వ్యక్తి తన భార్యను సౌదీ తీసుకువచ్చి ఓ ఏడాది పాటు తన వద్దే ఉంచుకోవాలని అనుకుంటే కనుక ‘ఇక్వామా’ పేరిట ముందస్తుగా 1200 రియాల్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే కనుక, ఓ వ్యక్తి తనభార్య, ఇద్దరు పిల్లలను కూడా ఏడాదిపాటు సౌదీలో ఉంచాలనుకుంటే ఏడాదికి 3600 రియాల్స్ చెల్లించాలి. అయితే, సౌదీ లోని కొన్ని కంపెనీలు తమ వద్ద పని చేసే భారతీయ ఉద్యోగులకు డిపెండెంట్ ఫీ కింద కొంత మొత్తాన్ని ఇవ్వాలని భావిస్తున్నాయి.

 కాగా, ఈ కొత్త పన్ను విధానాన్ని సౌదీ అమలు చేయనున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న అవివాహిత భారతీయులు పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య ఎక్కువే. ఇదిలా ఉండగా, సౌదీ విధించనున్న ఈ కొత్త పన్ను విషయమై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ, ఈ విషయమై తమకు ఎటువంటి సమాచారం అందలేదని అన్నారు.

  • Loading...

More Telugu News