: ఇన్ఫోసిస్ లో వివక్ష, వేధింపులు పెరిగాయని సంచలన ఆరోపణలు చేసిన ఎరిన్ గ్రీన్
ఇప్పటికే వ్యవస్థాపకులు, బోర్డు డైరెక్టర్ల మధ్య నెలకొన్న వివాదంతో సతమతమవుతున్న దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. సంస్థలో జాతి వివక్ష, ఉన్నతాధికారుల వేధింపులు, కక్షపూరిత వైఖరి పెరిగిపోయాయని ఆరోపిస్తూ, ఇన్ఫోసిస్ యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం మాజీ ఉన్నతాధికారి ఎరిన్ గ్రీన్ సంచలన ఆరోపణలు చేస్తూ, టెక్సాస్ కోర్టులో దావా వేశారు. తనకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ, 53 పేజీల ఫిర్యాదు పత్రాన్ని దాఖలు చేసిన ఆయన, సీనియర్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తాను చేరిన తరువాత ఉన్నతాధికారులు ప్రతీకార ధోరణితో ప్రవర్తించారని, వివక్షను చూపారని గ్లోబల్ ఇమ్మిగ్రేషన్ హెడ్ వాసుదేవ నాయక్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ హేంపాపుర్ లపై విమర్శలు గుప్పించారు. వీరు గత సంవత్సరం తనను సంస్థను వీడి పోవాలని కోరారని, తన ఆరోపణలపై విచారించి న్యాయం చేయాలని కోరారు. కాగా, దీనిపై స్పందించేందుకు ఇన్ఫోసిస్ అధికారులు నిరాకరించడం గమనార్హం.