: ‘కరెంటు రుణం’ అద్భుత ఆలోచన.. యూపీకి ఓకే కానీ.. తెలంగాణ, ఏపీలో పనిచేస్తుందా?
విద్యుత్ రుణం.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో ఉత్తరప్రదేశ్ కుదుర్చుకున్న ఈ వినూత్న విధానం దేశానికి రోల్ మోడల్ కానున్నా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఫలితాన్ని ఇచ్చే అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సూచించింది.
విద్యుత్ రుణంలో భాగంగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు ఉత్తరప్రదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తాయి. అయితే కరెంటు వాడుకున్నందుకు యూపీ ప్రభుత్వం పైసా కూడా చెల్లించదు. కాకపోతే ఆ రెండు రాష్ట్రాలకు విద్యుత్ అవసరం అయినప్పుడు మాత్రం యూపీ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పవర్ సరఫరా లేకపోతే విద్యుత్ రుణం అలాగే ఉండిపోతుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రుణంగా తీసుకున్న విద్యుత్‌ను సరఫరా చేస్తే ఆ రెండు రాష్ట్రాలు ఆ సమయంలో విద్యుదుత్పత్తిని తగ్గిస్తాయి.
కాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ విషయంలో వివాదం చెలరేగింది. బిల్లులు చెల్లించలేదని రెండు రాష్ట్రాలు ఒకదానికి ఒకటి విద్యుత్ సరఫరాను నిలిపివేశాయి. దీంతో కేంద్ర విద్యుత్ శాఖ తాజా సలహా ఇచ్చింది. దేశంలో చాలా రాష్ట్రాలు విద్యుత్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ‘విద్యుత్ రుణం’ అద్భుత ఫలితాలు ఇస్తుందని కేంద్రం భావిస్తోంది.
అయితే యూపీ ఫార్ములా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్నవి బీజేపీ ప్రభుత్వాలే కాబట్టి సమస్య లేదు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ తెలంగాణలో ప్రతిపక్షం. దీంతో యూపీ ఫార్ములా ఇక్కడ వర్క్ అవుటయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.