: ఆ పదాలు వాడటంతో దేనికీ లేనంత పబ్లిసిటీ వచ్చింది: పాటల రచయిత జొన్నవిత్తుల
‘డీజే’ సినిమాలోని ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’ అనే పాటలో ‘నమకం’,‘చమకం’,‘అగ్రహారం’ ..పదాలను వాడటంతో దేనికీ లేనంత పబ్లిసిటీ వచ్చిందని ప్రముఖ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘ ఈ పాటలో ‘నమకం’,‘చమకం’, ‘అగ్రహారం’ పదాలను వాడారు కదా! ఈ మూడు పదాలను వాడటం వలన.. అన్నమాచార్యులకు, త్యాగరాజస్వామికి, మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు పాడిన కీర్తనలకు రానంత పబ్లిసిటీ ఈ పాటకు వచ్చింది!
ఆ ‘నమకం’,‘చమకం’ వంటివి వాడకపోతే, నిజానికి, అంత పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఈ పదాలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం చెప్పిన వెంటనే వాటిని తీసివేసేందుకు ఈ చిత్ర దర్శకుడు ఒప్పుకున్నాడు. ఆ పాటలో నుంచి ఆ పదాలను తీయకపోతే, ఆయనకు ఫోన్ చేయాలి, లేదా, మధ్యవర్తిగా నన్ను ఉండమన్నారు కాబట్టి బ్రాహ్మణ సంఘాలు నాకన్నా ఫోన్ చేయాలి. ఈ రెండూ చేయకుండా హైకోర్టుకు వెళ్లడం సబబు కాదు’ అని జొన్నవిత్తుల అభిప్రాయపడ్డారు.