: బుమ్రాను ఆ బాధ చాలా కాలం వెంటాడుతుంది: గవాస్కర్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ ఓటమి వెనకున్న కారణాల్లో బూమ్రా వేసిన నోబాల్ కూడా ఒకటి. ఈ నోబాల్ వల్ల పాక్ ఓపెనర్ ఫకార్ కు లైఫ్ దొరికింది. ఆ తర్వాత సెంచరీ సాధించిన ఫకార్... తన జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. నోబాల్ వేసిన బుమ్రాపై అనేకమంది భారత నెటిజన్లు విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, ఆ నోబాల్ చాలా కాలం పాటు బుమ్రాను వెంటాడుతుందని, బాధిస్తుందని చెప్పారు. వాస్తవానికి ఈ టోర్నీలో బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని... అయితే, ఫైనల్లో నోబాల్ వేయడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. పైగా, పాకిస్థాన్ చేతుల్లో ఓడిపోవడంతో ఆ నోబాల్ బాధ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.