: ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియా రగడ ఎక్కడ నుంచి మొదలయిందంటే..!
మాజీ సీఎస్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తన అధికారిక ఫేస్ బుక్ పేజ్ నుంచి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను ఆయన షేర్ చేయడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఇక టీడీపీ వర్గాల్లో అయితే ఉదయం నుంచి దీనిపైనే చర్చ జరుగుతోంది. కొందరు టీడీపీ మద్దతుదారులు ఆయన తీరును ఫేస్ బుక్ ద్వారా ఖండించారు. మరికొందరైతే నేరుగా ఆయనకే ఫోన్ చేసి... ఆ పోస్టులను మీరే పెట్టారా? అని ప్రశ్నించారు.
అయితే, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదంతోనే ఐవైఆర్ సోషల్ మీడియా రగడ ఆరంభమైందని కొందరు అంటున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందితో దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన తర్వాత... వీవీఐపీలు కొంచెం ఆలస్యంగా విమానాశ్రయానికి వచ్చినా, వారిని విమానంలోకి అనుమతించాలని ఓ టీడీపీ మద్దతుదారుడు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టుపై ఐవైఆర్ స్పందించారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన వివాదం మొదలైనట్టు సమాచారం. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి పన్ను రాయితీని కల్పించడం, 'బాహుబలి-2' సినిమాకు టికెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని కల్పించడంలాంటి విషయాలను కూడా ఐవైఆర్ తప్పుబట్టారు.