: ఐసీసీ వన్డే పోటీల చరిత్రలో ఇది ఓ సరికొత్త రికార్డు!
గత ఆదివారం నాడు జరిగిన భారత్ - పాకిస్థాన్ ఫైనల్ పోటీలో ఓ సరికొత్త రికార్డు నమోదైంది. ఐసీసీ ఇప్పటివరకూ నిర్వహించిన అన్ని పోటీల్లో ఈ మ్యాచ్ లోనే అత్యధిక ట్వీట్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ ఆసియా పసిఫిక్ స్పోర్ట్స్ పార్టనర్ షిప్ చీఫ్ అనీశ్ మదానీ అధికారికంగా తెలిపారు. ఈ మ్యాచ్ కి 18 లక్షలకు పైగా ట్వీట్లు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఈ మ్యాచ్ ఫోటోలు, వీడియోలు, లైవ్ అప్ డేట్లను క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో పంచుకున్నారని ఆయన అన్నారు.
2013లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో పోల్చితే, ఐసీసీ ట్విట్టర్ అధికారిక ఖాతాను ఫాలో అవుతున్న వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇక, ట్విట్టర్ లో అత్యధిక ట్వీట్లు వచ్చిన ఐసీసీ మ్యాచ్ లను పరిశీలిస్తే, తొలి స్థానంలో భారత్ - పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ ఉండగా, ఆ తరువాతి స్థానంలో గ్రూప్ దశలో ఈ దేశాల మధ్య జరిగిన మ్యాచ్ నిలిచింది. ఆపై భారత్ - దక్షిణాఫ్రికా, భారత్ - బంగ్లాదేశ్, ఇంగ్లండ్ - పాకిస్థాన్ సెమీ ఫైనల్ మ్యాచ్ లు టాప్-5 స్థానాల్లో ఉన్నాయని అనిశ్ తెలిపారు.