: 1993 పేలుళ్ల ప్రధాన దోషులకు ఉరే సరి.. స్పెషల్ కోర్టుకు తెలిపిన ప్రాసిక్యూషన్
1993 బాంబు పేలుళ్లలో దోషులుగా తేలిన నలుగురికీ మరణశిక్ష విధించాలని ప్రత్యేక న్యాయస్థానాన్ని ప్రాసిక్యూషన్ కోరింది. నాటి వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మృతి చెందగా 713 మంది గాయపడ్డారు. సీబీఐ ప్రత్యేక న్యాయవాది దీపక్ సాల్వి ప్రత్యేక న్యాయస్థానానికి దరఖాస్తు సమర్పిస్తూ.. పేలుళ్లలో దోషులుగా తేలిన ముస్తాఫా దోసా (60), ఫెరోజ్ ఖాన్ (47), కరీముల్లా ఖాన్ (55), తాహెర్ మర్చెంట్ (55)లకు మరణశిక్ష విధించాలని కోరారు.
కాగా, మరో దోషి అబు సలేం (48)ను 2005లో పోర్చుగల్ నుంచి తీసుకువచ్చిన సమయంలో ఆ దేశానికి ఇచ్చిన హామీ మేర అతనికి 25 ఏళ్లకు మించి జైలు శిక్ష విధించడానికి అవకాశం లేదని, అలాగే ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన రియాజ్ సిద్ధిఖీ (67)కి జీవితకాల శిక్ష, లేదంటే తక్కువలో తక్కువగా ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్టు డిఫెన్స్ పేర్కొంది. పేలుళ్ల కేసులో వీరిని దోషులుగా తేల్చిన కోర్టు, శిక్షల ఖరారుపై డిఫెన్స్, ప్రాసిక్యూషన్ వాదనలు వింటోంది.