: ఇందిరాగాంధీ చేసిన తప్పు అదొక్కటే.. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం!
మహాత్మాగాంధీ తర్వాత దేశానికి ఇందిరాగాంధీ గురించి మాత్రమే తెలుసని, ఆమె దేశానికి చెందిన నేత అని.. కులం, మతం, ప్రాంతంతో ఇందిరకు సంబంధం లేదని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ నేత పి.చిదంబరం పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇందిరా గాంధీ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ ఓ సెమినార్ నిర్వహించింది. ‘రాడికలైజింగ్ డెమొక్రసీ’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని, అందరూ ఆమెను గుర్తుపడతారని పేర్కొన్నారు. పేదల కోసం ఆమె చేపట్టినట్టు దేశంలో మరెవరూ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇందిరను విమర్శించాయి తప్పితే ఆమె సంక్షేమ కార్యక్రమాలను ఎప్పుడూ తప్పుబట్టలేదన్నారు. ఇందిరాగాంధీ చాలా ధైర్యవంతురాలని, ఆమె చేసిన ఒకే ఒక్క పొరపాటు ‘అత్యయిక పరిస్థితి’ (ఎమర్జెన్సీ) విధించడమేనని చిదంబరం తెలిపారు.