: విమానాశ్రయంలో జేసీ దివాకర్ రెడ్డి ప్రవర్తనపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానయాన సిబ్బందితో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రవర్తించిన తీరుపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ రోజు ఆయన అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జేసీ ప్రవర్తనపై మాట్లాడుతూ ఈ తరహా ప్రవర్తన సరికాదని అన్నారు. ఇటువంటి ఘటనలు పార్టీకి మంచిదికాదని, నేతలు సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
కాగా, ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు అనంతపురం జడ్పీ ఛైర్మన్ పదవిని పూల నాగరాజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అనంతపురం జడ్పీ ఛైర్మన్‌గా చమన్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే పుట్టపర్తి పురపాలక ఛైర్మన్ గంగన్నతో రాజీనామా చేయించాలని, కొత్త అభ్యర్థిని ఎన్నుకోవాలని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.